Asia -Cup - 2018 -Bangladeshఆసియా కప్ లో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టిన మాట వాస్తవం గానీ, ఈ టోర్నీలో హైలైట్ గా నిలిచిన జట్టు అంటే అది ఆఫ్ఘనిస్తాన్ అనే చెప్పాలి. పసికూనలుగా అడుగుపెట్టిన ఆఫ్ఘన్, అదురు, బెదురు లేకుండా అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంది.

లీగ్ లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్ లలో విజయాలు సాధించిన ఆఫ్ఘన్, సూపర్ 4లో ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యింది. రెండు మ్యాచ్ లలో ఓడిపోయినా, ఈ రెండు మ్యాచ్ లలో కూడా విజయపు అంచులదాకా వచ్చింది ఆఫ్ఘన్ జట్టు. నిజానికి ఈ రెండు మ్యాచ్ లలో కూడా ఈ జట్టే విజయం సాధించాల్సి ఉంది.

కానీ అనుభవలేమీ కారణంగా సరైన రీతిలో ఆడలేక చివరి ఓవర్లలో చతికిలపడింది. తాజాగా జరిగిన మ్యాచ్ లోనూ చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కానీ బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యింది.

బహుశా మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంటే, ఈ రెండు మ్యాచ్ లలో ఫలితం వేరేలా ఉండి, టీమిండియాతో ఫైనల్లోకి దూసుకెళ్ళేది. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో తమ మార్క్ ను చాటుకోవడానికి ఆసియా కప్ ను ఆఫ్ఘన్ జట్టు బాగా వినియోగించుకుంది. బహుశా మున్ముందు మరిన్ని సిరీస్ లలో ఆఫ్ఘన్ కు అవకాశం దక్కవచ్చు.